: నేడు బీజేపీ 'తెలంగాణ ఆవిర్భావ, అభినందన' సభ
ప్రత్యేక తెలంగాణ సాకారమైన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్, నిజాం కాలేజీ మైదానంలో బీజేపీ ఆధ్వర్యంలో 'తెలంగాణ ఆవిర్భావ, అభినందన' సభ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభ ఏర్పాట్లను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, నేతలు దత్తాత్రేయ, శ్రీనివాస్ రెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పరిశీలించారు. ఈ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్, రాజ్యసభ పక్ష నేత అరుణ్ జైట్లీ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు వీరిద్దరూ హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 3 గంటలకు ఎంఏజీ, సీఐఐ, వైపీఓ, ఫాప్సీ, క్రెడాయ్, ఫిక్కీ తదితర సంస్థల సంఘాలు కలసి నిర్వహించే సమావేశంలో అరుణ్ జైట్లీ పాల్గొంటారు. రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందాక భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తోన్న తొలి విజయోత్సవ సభ కావడంతో తెలంగాణ లోని పది జిల్లాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలను తరలించడానికి ఆ పార్టీ నేతలు సమాయత్తమయ్యారు.