: మొయిలీ పోటీ చేయకపోతే చిక్ బళ్ళాపూర్ చిరంజీవికే?
వచ్చే లోక్ సభ ఎన్నికల కోసం రెండు రోజుల కిందట (శనివారం) కాంగ్రెస్ తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ పేరు తప్ప కర్ణాటకలోని పార్టీ సిట్టింగ్ ఎంపీల పేర్లు అందరివీ పేర్కొంది. ఎందుకంటే, ఆయన చిక్ బళ్ళాపూర్ సిట్టింగ్ ఎంపీ. ఉత్తర బెంగళూరుకు 50 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంటుంది. తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో... పోటీ చేయడం లేదని, డ్రాప్ అయినట్లు వెంటనే జోరుగా ప్రచారం జరిగింది. ఆ వెంటనే కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు జి.పరమేశ్వర్ స్పందిస్తూ, మొయిలీ పేరు రెండవ జాబితాలో ఉంటుందన్నారు.
కానీ, కొంతమంది కాంగ్రెస్ నేతల సమాచారం ప్రకారం... ఈసారి చిక్ బళ్ళాపూర్ లో పోటీ తీవ్రంగా ఉంటుందని, అందుకే అక్కడి నుంచి పోటీ చేయడంపై మొయిలీ సందేహం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. దాంతో, అక్కడి నుంచి సినీ నటుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ బోర్డర్ కు దగ్గరగా ఉన్న చిక్ బళ్ళాపూర్ లో తెలుగు మాట్లాడే వారు ఎక్కువగా ఉంటారు. 2009 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన మొయిలీ అప్పటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రచారం చేయడంతో గెలిచారు. ఇదిలా ఉంటే, జులైలో కర్ణాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవనున్నాయని, ఆ ఎన్నికలపై మొయిలీ కన్నేశారని మరికొంతమంది అంటున్నారు.