: సోనియా కొవ్వొత్తులు.. రాహుల్ విసనకర్రలు: పయ్యావుల కేశవ్ వ్యంగ్యం
నేటి అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విద్యుత్ సమస్య అంశంపై ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. విద్యుత్ సంక్షోభంపై ప్రశ్నిస్తే కిటికీలు తెరుచుకోవాలని జవాబిస్తున్న ముఖ్యమంత్రి.. సోనియా పేరిట కొవ్వొత్తులు, రాహుల్ పేరిట విసనకర్రలు రాయితీపై సరఫరా చేయాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. విద్యుత్ అంశంపై స్వల్ప కాలిక చర్చలో ఆయన మాట్లాడారు.
విద్యుత్ కోతలతో రాష్ట్రం అంధకారంలో మునిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఉత్పత్తి కోసం అనుమతులు దక్కించుకున్న ప్రైవేటు సంస్థలు బూడిదను రాష్ట్ర ప్రజలకిచ్చి, కరెంటును పక్కరాష్ట్రాలకు అమ్ముకుంటున్నాయని పయ్యావుల ఆరోపించారు. లాభాలేమో కంపెనీలకు, కమీషన్లేమో పెద్దలకు దక్కుతున్నాయని.. ప్రజలకు మిగిలేది నష్టాలేనా? అని ప్రశ్నించారు.
కరెంటు బిల్లుల్లో ఏకరూపత ప్రదర్శిస్తోన్న సర్కారు.. విద్యుత్ సరఫరాలో నగర, గ్రామీణ ప్రాంతాల మధ్య వివక్ష చూపుతోందని విమర్శించారు. 2004 నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచబోమంటూనే ఇప్పటివరకు నాలుగు సార్లు పెంచారని పయ్యావుల దుయ్యబట్టారు. దీంతో, ప్రజలపై రూ. 32,000 కోట్ల భారం పడిందని ఆయన వివరించారు.
ప్రభుత్వం సబ్సీడీలు ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రరూపం దాల్చుతున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం ఇకనైనా కళ్ళుతెరవాలని హితవు పలికారు. విద్యుత్ ఉత్పిత్తి కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని పయ్యావుల డిమాండ్ చేశారు.