: ఆసియా కప్ ఓటమికి బౌలర్లను తప్పుబట్టిన పాక్ కెప్టెన్
ఆసియా కప్ ఫైనల్లో లంక చేతిలో ఓటమిపై పాకిస్తాన్ సారథి మిస్బావుల్ హక్ స్పందించాడు. ఆ పరాజయానికి బౌలర్ల పేలవ ప్రదర్శనే కారణమని పేర్కొన్నాడు. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడంలో వారు విఫలమయ్యారని విమర్శించాడు. బంగ్లాదేశ్ లోని మిర్పూర్లో నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, 'ఇలాంటి మ్యాచ్ లలో ఆరంభంలోనే వికెట్లు తీయడం ఎంతో అవసరం. కానీ, ఆ పని చేయలేకపోయాం. ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ సరైన బ్రేక్ ఇచ్చినా దాన్ని కొనసాగించలేకపోయాం. ఆ తర్వాత ఏ ఒక్క బౌలరూ లంక బ్యాట్స్ మెన్ ను ఇబ్బందికి గురి చేయలేకపోయారు. దాంతో వారికి లక్ష్య ఛేదన సులువైంది' అని అభిప్రాయపడ్డాడు. ఇక్కడి స్లో పిచ్ పై వికెట్ టు వికెట్ బౌలింగ్ చేస్తే ఫలితం మరోలా ఉండేదని చెప్పుకొచ్చాడీ వెటరన్ బ్యాట్స్ మన్.
నిన్న జరిగిన ఈ డే-నైట్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ ఐదు వికెట్లకు 260 పరుగులు చేయగా, లంక ఐదు వికెట్లతో విజయం సాధించింది. ఓపెనర్ తిరిమన్నే సెంచరీ సాధించి జట్టు గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు.