: రాజకీయాల్లో ఏం చేయవచ్చో చూపిస్తా: మహ్మద్ కైఫ్
కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తరప్రదేశ్ లోని పూల్ పూర్ లోక్ సభ అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్న క్రికెటర్ మహ్మద్ కైఫ్.. రాజకీయాలు తనకు సెకండ్ ఇన్నింగ్స్ లాంటివన్నాడు. క్రికెట్ లో మాదిరిగానే రాజకీయాల్లోనూ సక్సెస్ అవుతాననే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. నిన్న కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితాలో చోటు లభించడంతో కైఫ్ ను మీడియా ప్రతినిదులు కాన్పూర్ లో పలకరించారు. ఇక క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నారా? అని అడగ్గా, 'అబ్బే అలాంటి ఆలోచనే లేద'ని తేల్చి చెప్పాడు.
క్రికెట్ కు, రాజకీయాలకు సమప్రాధాన్యం ఇస్తానని చెప్పాడు. కొన్ని రోజుల క్రితమే జైపూర్ లో జరిగిన రంజీ మ్యాచుల్లో రెండు చక్కటి ఇన్నింగ్స్ లు ఆడానని.. ఒకదాంట్లో 80, మరొక దాంట్లో 70 పరుగులు సాధించానని గుర్తు చేశాడు. 'ప్రజలు రాజకీయాలను చెత్తగా భావిస్తుంటారు. రాజకీయాల ద్వారా పనులు చేయవచ్చని నేను నిరూపిస్తా' అని శపథం చేశాడు. కైఫ్ కు కాంగ్రెస్ పార్టీ లోక్ సభ టికెట్ దక్కడం పట్ల ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సంతోషం వ్యక్తం చేసింది. కైఫ్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రంజీ జట్టు సభ్యుడిగా ఉన్నాడు.