: ప్రజాభిప్రాయాన్ని గౌరవించి, నేనీ నిర్ణయం తీసుకున్నా: పురంధేశ్వరి
కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి నిన్న భారతీయ జనతాపార్టీ జాతీయ నేతలందర్నీ కలిసి... కమల తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఈరోజు (శనివారం) పార్టీ మారిన విషయమై హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ విధానాలను ప్రజల వద్దకు సరిగా తీసుకెళ్లలేకపోయామని పురంధేశ్వరి అన్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ తాను ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తనను గౌరవించిందని, అందులో ఎటువంటి సందేహం లేదని ఆమె చెప్పారు.
రామాయంపట్నంలో వెయ్యి ఎకరాల భూమి ఉందంటూ కాంగ్రెస్ నేతలు అంటున్నారని, మా భూములు ఎక్కడున్నాయో జైరాం రమేశ్ చెబితే చూసుకుంటానంటూ ఆమె చురక వేశారు. దుగ్గరాజపట్నంతో పాటు రామాయంపట్నంలో కూడా పోర్టు ఏర్పాటు చేయాలని కోరిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీని బజారుకీడ్చే పని తానెప్పుడూ చేయలేదని పురంధేశ్వరి చెప్పారు. విశాఖ లోక్ సభ స్థానం నుంచి తాను మారాలని దిగ్విజయ్ సింగ్ అడిగారని, సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని ఎలా మారుస్తారని అప్పుడే తాను దిగ్విజయ్ ను అడిగానని ఆమె అన్నారు.