: బీరు పందెంలో ఓడిన బరాక్ ఒబామా
అగ్రరాజ్యానికి అధ్యక్షుడైన ఒబామా కెనడా ప్రధానమంత్రి స్టీఫెన్ హార్పర్ తో లోగడ ఒక పందెం కాశారు. ఒలింపిక్స్ హాకీలో అమెరికాపై కెనడా గెలిస్తే.. ఒక కేసు బీర్లు చెల్లిస్తానన్నారు. పురుషులు, మహిళల విభాగాల్లో కెనడా జట్లు అమెరికాను చిత్తు చేశాయి. కానీ, ఇంతవరకు ఒబామా హామీ మేరకు బీరు కేసు పంపలేదట. ఈ విషయాన్ని తాజాగా కెనడా ప్రధానమంత్రే స్వయంగా వెల్లడించారు.
'ఒబామా పందెంలో ఓడిపోయారు. బీర్లు ఇంకా అందించాల్సి ఉంది' అంటూ టోరంటోలో ఒక రేడియో స్టేషన్ కు ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పారు. దీనిపై అమెరికా అధ్యక్షుడి కార్యాలయం వైట్ హౌస్ స్పందించింది. అధ్యక్షుడు తన పందేల విషయంలో కచ్చితంగా ఉంటారని, బీర్లు అందించాల్సి ఉన్న విషయం రహస్యమేమీ కాదని స్పష్టం చేసింది. హార్పర్, ఆయన బృంద సభ్యులు త్వరలోనే బీర్ల రుచి చూస్తారని వైట్ హౌస్ ప్రతినిధి జోష్ ఎర్నెస్ట్ శుక్రవారం మీడియాకు తెలిపారు.