: ఈ చేతి పట్టీతో వాయు కాలుష్యాన్ని పసిగట్టవచ్చు!
మన దైనందిన జీవనంలో ఎన్నో రకాల కాలుష్యాలు... భయంకరమైన వ్యాధులకు కారణమయ్యే రసాయనాలు, పురుగుమందులు. చివరికి గాలి పీల్చినా ఏదో ఒక రసాయనం మన శరీరంలోకి చేరుతోంది. మరి, మనం పనిచేసే చోటనో, నివాసిత ప్రాంతంలోనే ఏ వాయువులు, రసాయనాలున్నాయో ఎలా తెలుస్తుంది? అందుకోసం ఒక చేతి పట్టీ లాంటి స్మార్ట్ పరికరాన్ని అమెరికాలోని ఒరెగాన్ వర్శిటీ పరిశోధకులు కనుగొన్నారు. సిలికాన్ తో తయారుచేసిన ఈ పట్టీ... మనం ఉంటున్న చోట వాయువులు, రసాయనాలను పీల్చుకుంటుందని పరిశోధకుడు కిమ్ అండర్సన్ తెలిపారు. ఈ పట్టీని పరిశీలించి రసాయనాల స్థితిని తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. దీంతో అగ్నిమాపక రసాయనాలు, పురుగుమందులు, పరిశ్రమలు, వివిధ వినియోగ వస్తువుల నుంచి వెలువడే వాయువులను గుర్తించవచ్చని ఆయన తెలిపారు. ఈ పట్టీతో మొత్తం వెయ్యి వరకు రసాయనాలు, వాటి గాఢతను గుర్తించవచ్చని కిమ్ వెల్లడించారు.