: బీజేపీతో పొత్తుకు కెప్టెన్ గ్రీన్ సిగ్నల్... పీఎంకే స్నేహ హస్తం!
బీజేపీకి తమిళనాడులోనూ మిత్రులు అందివచ్చారు. తమిళులకు ప్రాంతీయ, భాషాభిమానం మెండు. ఆ ఉద్దేశంతోనే వారు జాతీయ పార్టీలను ఆదరించరు. ఆ రాష్ట్రంలో కొద్దో గొప్పో సీట్లు సాధించాలంటే ప్రాంతీయ పార్టీల మద్దతు తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లో.. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు నటుడు విజయ్ కాంత్ సారధ్యంలోని డీఎండీకేతో పాటు పీఎంకే కూడా ముందుకు రావడం రాజకీయంగా ప్రాధాన్యం కలిగించే విషయం.
బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించామని, సీట్ల పంపకాలపై చర్చలు జరుపుతున్నట్లు డీఎండీకే ఒక ప్రకటన జారీ చేసింది. అలాగే, పీఎంకే కూడా బీజేపీతో పొత్తుపై చర్చించేందుకు ఒక కమిటీని వేసింది. దీంతో తమిళనాడులో బీజేపీకి మూడు పార్టీల సహకారం అందివచ్చినట్లయింది. ఇది మామూలు విషయం కాదు. ఇప్పటికే వైగో సారధ్యంలోని ఎండీఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని నెల రోజుల క్రితమే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నాలుగు పార్టీల కూటమి ఎన్ని స్థానాలు సాధిస్తుందో చూడాలి.