: పవన్ ముందు మూడు ఆప్షన్లు!
రాష్ట్ర పరిణామాల నేపథ్యంలో రాజకీయాల్లోకి వచ్చే విషయమై హీరో పవన్ కల్యాణ్ ఇంకా స్పష్టత ఇవ్వని సంగతి తెలిసిందే. ఆదివారం ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు చెబుతాడని వార్తలు రావడంతో, ఆయన పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉంటుందన్న విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. అన్నయ్య చిరంజీవితో విభేదాలు(?), విభజన వంటి అంశాలు పవన్ నిర్ణయంపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. అయితే, ఆయన ముందు ప్రధానంగా మూడు ఆప్షన్లు ఉన్నాయి. 1.కొత్త రాజకీయ పార్టీ ప్రకటన 2. ఏదో ఒక పార్టీలో చేరడం. 3. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయడం. వీటిలో పవన్ ఏది ఎంచుకుంటారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు యువరాజ్యం తరపున పవన్ కాంగ్రెస్ నాయకులపై విరుచుకుపడ్డాడు. దీంతో ఆయన కాంగ్రెస్ లోకి వెళ్ళే అవకాశాలు మృగ్యం. ఇక ఆయన వస్తే స్వాగతిస్తామని, రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తామని లోక్ సత్తా ఈసరికే బహిరంగ ప్రకటన చేసింది కూడా. మరోవైపు సైద్ధాంతిక పరంగా ఆమ్ ఆద్మీ ఈ మెగా హీరోకు దగ్గరగా కనిపిస్తోంది. ఏదేమైనా, ఆదివారం పవన్ ప్రెస్ మీట్ తో అన్ని ప్రశ్నలకు జవాబులు లభిస్తాయి.