: తమిళనాడులో పొత్తును కాలదన్నిన జయలలిత!
తమిళనాడులోని 39, పుదుచ్చేరిలో ఒక స్థానం... మొత్తం 40 లోక్ సభ స్థానాలూ మావే... ముఖ్యమంత్రి జయలలిత వామపక్షాలతో కొన్ని రోజుల క్రితం పొత్తు కుదుర్చుకున్న తర్వాత చేసిన ప్రకటన ఇది. ఇప్పుడు వారి పొత్తు మొదట్లోనే విచ్ఛిన్నమైంది. సీపీఎం, సీపీఐకి చెరొక స్థానమే కేటాయిస్తాననడం.. ఆ సంఖ్యకు వామపక్షాలు అంగీకరించకపోవడంతో పొత్తు లేకుండానే ఎన్నికలకు వెళ్లాలని జయలలిత నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఆమె సీపీఎం నేతలకు తన అనుచరుల ద్వారా తెలియజేసినట్లు తెలిసింది. దీనిపై వామపక్షాలు నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. ఇక పొత్తుకు అవకాశాలు లేవని సీపీఐ సీనియర్ నేత ఒకరు తెలిపారు. సీఎన్ఎన్ ఐబీఎన్ ఎలక్షన్ ట్రాకర్ సర్వేలో.. జయలలిత సారధ్యంలోని అన్నా డీఎంకేకు 15 నుంచి 23 స్థానాలు వస్తాయని తేలింది. ఈ నేపథ్యంలో వామపక్షాలతో పొత్తు లేకుండా వెళితే అన్నాడీఎంకేపై ఎంతో కొంత ప్రభావం పడే అవకాశాలున్నాయి. దీంతో ప్రధానమంత్రి కావాలన్న పురచ్చితలైవి స్వప్నం.. అలానే మిగిలిపోనుంది!