: నిరసన తెలపడంలో ఈ న్యాయవాది రూటే సెపరేటు!


సహారా గ్రూపు అధినేత సుబ్రతారాయ్ పై సుప్రీంకోర్టు ఆవరణలో ఇంక్ చల్లడం ద్వారా మనోజ్ శర్మ అనే న్యాయవాది మరోసారి వార్తల్లోకి వచ్చాడు. మనోజ్ శర్మ గురించి తెలిసిన వారెవరూ ఆయన చేసిన పనికి ఆశ్చర్యపోయి ఉండరు. ఎందుకంటే, ఇలాంటి పనులు ఆయనకు కొత్త కాదు. గ్వాలియర్ కు చెందిన మనోజ్ శర్మ చేసిన ఆకతాయి పనికి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి బుధవారం ఢిల్లీలోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ కోర్టులో హాజరు పరచగా.. మేజిస్ట్రేట్ మార్చి 11వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

'పేదవారి సొమ్మును కాజేసిన దొంగ' అంటూ ఆగ్రహంతో మనోజ్ శర్మ సుబ్రతారాయ్ పై ఇంక్ చల్లి.. సామాన్యుల కడుపుమంట ఎలా ఉంటుందో ఆయనకు తెలిసేలా చేశారు. ఇన్వెస్టర్లకు రూ. 24వేల కోట్లు చెల్లించడంలో సహారా సంస్థ విఫలమైనందుకు సుబ్రతారాయ్ పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.

మనోజ్ శర్మ 2010లో కాంగ్రెస్ మాజీ నేత, కామన్వెల్త్ క్రీడల అక్రమాల కేసులో విచారణ ఎదుర్కొంటున్న నిందితుడు సురేశ్ కల్మాడీపై చెప్పు విసిరి నిరసన తెలిపాడు. ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ చైర్మన్ గా కల్మాడీ హయాంలోనే ఢిల్లీలో కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని వాజ్ పేయి పేరుతో మరణ ధ్రువీకరణ పత్రాన్ని కూడా మనోజ్ 2005లో సంపాదించాడు. ప్రభుత్వ విభాగాలలో అవినీతి ఏ స్థాయిలో వేళ్లూనుకుని ఉందో తెలియజేయడానికి అలా చేశాడు. పోలీసులు మనోజ్ ను ఒక మానసిక రోగిగా భావిస్తుంటే.. అతడు మాత్రం తాను చేసింది సరైనదేనని సమర్థించుకుంటున్నాడు.

  • Loading...

More Telugu News