: రెండు ప్రాంతాల్లో తిరుగులేని పార్టీ టీడీపీయే: బాబు
తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ ఆటలు సాగవని... వచ్చే ఎన్నికల్లో రెండు ప్రాంతాల్లో టీడీపీయే తిరుగులేని శక్తిలా అవతరిస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు నమ్మకం ఉంచాలని, విజయం మనదే అని నొక్కి చెప్పారు. అధికారంలో రాగానే కార్యకర్తలకు న్యాయం చేస్తానని తెలిపారు. ప్రజలు మోసకారి పార్టీలను నమ్మబోరని, టీడీపీ నిజాయతీ ఉన్న పార్టీ అని స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే రైతుల రుణాల మాఫీ చేస్తుందని హామీ ఇచ్చారు. తాము దీపం పథకం పెడితే కాంగ్రెస్ దొంగలు ఆ దీపాన్ని ఆర్పేశారని మండిపడ్డారు.
తామిచ్చిన అన్ని హామీలకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఉద్యోగం రావాలంటే యువత బాబు అధికారంలోకి రావాలని కోరుకుంటోందని తెలిపారు. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలకు తానే అనుమతులిచ్చానని చెప్పుకొచ్చారు. నిధులు తీసుకొచ్చి సీమాంధ్రను స్వర్ణాంధ్రగా మార్చుతానని స్పష్టం చేశారు. తల్లిదండ్రులకంటే తానే ఎక్కువగా వారి పిల్లల కోసం శ్రమిస్తానని ప్రమాణం చేశారు. మళ్ళీ ఆశీర్వదించాలని, తెలంగాణలో, సీమాంధ్రలో అత్యధిక స్థానాల్లో గెలిపించాలని బాబు కోరారు. విద్యావంతులందరికీ ఉద్యోగాలిప్పిస్తానని హామీ ఇచ్చారు. వారికి ఉద్యోగం వచ్చేవరకు 1000 రూపాయలు నిరుద్యోగ భత్యం ఇస్తామని చెప్పారు.