: 'గులాబ్ గ్యాంగ్'ను ఆపండంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
మాధురీదీక్షిత్, జుహీచావ్లా తదితర తారాగణంతో తెరకెక్కిన 'గులాబ్ గ్యాంగ్' చిత్రం విడుదలను ఆపాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ఈ రోజు పిటిషన్ దాఖలైంది. సంపత్ పాల్ అనే ఉద్యమకారిణి దీన్ని దాఖలు చేశారు. ఇది తన జీవితం ఆధారంగా తెరకెక్కించిన సినిమా అంటూ ఆమె కోర్టుకు తెలిపారు. ఈ సినిమా ఈ నెల 7న విడుదల కానుంది.
సంపత్ పాల్.. మహిళలపై గృహహింస, వారిపై నేరాలు, అవినీతి, అసమానతలపై పోరాటం కోసం గులాబీ గ్యాంగ్ పేరుతో ఉత్తర ప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ లో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరంతా మహిళలే. గులాబీరంగు చీరలు ధరించి ఆ ప్రాంతంలో నిఘా, రక్షణ బాధ్యతలు చూస్తుంటారు.
ఇప్పుడు గులాబ్ గ్యాంగ్ చిత్రం దీని ఆధారంగానే తెరకెక్కిందని.. ఇందుకు తన అనుమతి తీసుకోలేదని సంపత్ పాల్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఇందులో కొన్ని సన్నివేశాలు తన ప్రతిష్ఠకు భంగకరమని, సినిమా విడుదల నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే, ఇంతకాలం ఏం చేశారని, సినిమా విడుదలకు ముందు ఆఖరి నిమిషంలో రావడమేంటి? అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. విచారణ ఇంకా పూర్తి కాలేదు.