: రోహిత్ శర్మ ముఖంపై కత్తిగాటు ఏంటబ్బా!
ముఖంపై కత్తిగాటుతో ఉన్న టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ పోస్టర్లు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. విషయం ఏమీలేదండీ... ఈ టీమిండియా వన్డే ఓపెనర్ రోహిత్ శర్మ మూగజీవాలపై ప్రేమ ప్రదర్శిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా జంతువుల హక్కుల కోసం పోరాడుతున్న పీపుల్స్ ఫర్ ఎథికల్ ట్రీట్ మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) సంస్థతో రోహిత్ కూడా చేతులు కలిపాడు. ఇంతకుముందే, వన్యప్రాణులను బోనులలో బంధించవద్దంటూ లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా కూడా పెటా తరపున ప్రచారం చేశాడు. తాజాగా, జంతువులతో ప్రమాదకర ఫీట్లు చేయించే సర్కస్ లను నిషేధించాలని రోహిత్ అంటున్నాడు.
రోహిత్ పై చిత్రీకరించిన ప్రచార చిత్రాలను తాజాగా విడుదల చేశారు. వాటిలో రోహిత్ ముఖంపై ఓ కత్తిగాటు ఉంటుంది. సీరియస్ గా చూస్తున్న రోహిత్ ముఖచిత్రం పక్కన సర్కస్ లు నిషేధించాలంటూ ఓ క్యాప్షన్ పెట్టారు. పెటాకు ప్రచారంపై ఈ ముంబైవాలా మాట్లాడుతూ, జంతువులను కూడా గౌరవించాల్సిన అవసరం ఉందని, కొరడాలు ఝుళిపిస్తూ వాటితో సర్కస్ ఫీట్లు చేయించడం దారుణమని అభిప్రాయపడ్డాడు. తాము క్రికెటర్లమని, తమ ఇష్టపూర్తిగా ఈ క్రీడలో మమేకం అవుతామని, కానీ, జంతువులు వాటి ఇష్టానికి వ్యతిరేకంగా ప్రదర్శనల్లో పాల్గొనాల్సి వస్తోందని రోహిత్ ఆవేదన వ్యక్తం చేశాడు.