: తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు పదేళ్ల పాటు పన్ను మినహాయింపులు: జైరాం రమేష్
రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర మంత్రి జైరాం రమేష్ ఇరు ప్రాంత ప్రజలను తమ వైపుకు తిప్పుకునే యత్నం చేస్తున్నారు. ఈ మేరకు ఈ రోజు వరంగల్ లో పర్యటిస్తున్న జైరాం, తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు పదేళ్ల పాటు పన్ను మినహాయింపులు ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఎన్టీపీసీ ద్వారా 4వేల మెగావాట్లతో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విద్యుత్ ప్లాంట్ లో 59 శాతం తెలంగాణకు, 41 శాతం కేంద్రానికి కేటాయిస్తామన్నారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకపోతే తెలంగాణ బిల్లు ఆమోదం పొందేది కాదని చెప్పిన మంత్రి, హైదరాబాదులో వచ్చే ప్రతి రూపాయి తెలంగాణదేనన్నారు. తెలంగాణ ఇప్పుడు బిల్లు కాదని చట్టమని పేర్కొన్నారు.
కాగా, టీఆర్ఎస్ తో అత్యున్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, పొత్తుల అంశం ఇంకా సజీవంగానే ఉందని చెప్పారు. ఇక ఆర్టికల్ 371 డి రెండు రాష్ట్రాల్లో కొనసాగుతుందని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సుప్రీంను ఆశ్రయించడంలో ఆశ్చర్యంలేదని, ప్రజాస్వామ్యంలో ఎవరైనా న్యాయస్థానానికి వెళ్లవచ్చునని చెప్పారు. 1959కు ముందు భద్రాచలం సీమాంధ్ర ప్రాంతానిదేనన్నారు. బిల్లు సమయంలో బీజేపీ లోక్ సభలో ఒకరీతిలో, రాజ్యసభలో మరో రీతిలో వ్యవహరించిందని ఆరోపించారు.