: కేసీఆర్ ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు: పొన్నాల
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ ను విలీనం చేయమని ఎవరూ అడగలేదని, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే బేషరతుగా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని నిండు సభల్లో కేసీఆర్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణను తామే తెచ్చామని కేసీఆర్ చెప్పుకుంటున్నాడని, 548 మంది ఉన్న పార్లమెంటులో కేవలం ఇద్దరు ఎంపీలను కలిగి ఉన్న కేసీఆర్, తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా సాధించాడో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ఏర్పాటు పూర్తికాగానే కేసీఆర్ నేరుగా సోనియా గాంధీని కుటుంబ సమేతంగా ఎందుకు కలిసాడో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ విశ్వసనీయత అందరికీ తెలిసిందేనని, దానిపై తానేమీ వ్యాఖ్యానించనని పొన్నాల స్పష్టం చేశారు.