: 'కమలం' ఎవరితో కలిసేనో...?
సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తుండడంతో పార్టీలన్నీ పొత్తు రాజకీయాలపై దృష్టి సారిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసి, జాతీయస్థాయిలో అతిపెద్ద పార్టీగా అవతరించాలని భావిస్తున్న బీజేపీకి ఈ ఎన్నికలు ఎంతో కీలకం. గుజరాత్ సీఎం నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన కాషాయదళం పొత్తులపై మల్లగుల్లాలు పడుతోంది. తాజాగా తమిళనాట డీఎంకే, డీఎండీకేలు బీజేపీతో పొత్తుకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ఏ పార్టీతో కలవాలన్న దానిపై బీజేపీ అధినాయకత్వం రేపు స్పష్టత ఇవ్వనుంది.
ఈ మేరకు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎల్.గణేశన్ మాట్లాడుతూ, పొత్తు విషయం రేపు ప్రకటిస్తామని చెప్పారు. రెండు పార్టీలతో పొత్తు ఉంటుందా? అన్న ప్రశ్నకు బదులిచ్చేందుకు నిరాకరించారు. కాగా, తనకు మోడీ మంచి స్నేహితుడని డీఎంకే అధినేత కరుణానిధి ఇటీవలే చెప్పడం చూస్తుంటే, బీజేపీతో డీఎంకే పొత్తు ఖాయమైనట్టుగానే కనిపిస్తోంది. మరోవైపు విజయ్ కాంత్ సారథ్యంలోని డీఎండీకే పార్టీ ఇంకా ఎన్నికల పొత్తులపై స్పష్టమైన అభిప్రాయానికి రాలేదని తెలుస్తోంది.