: భార్య అయినంత మాత్రాన భర్త పెట్టే ఆంక్షలు భరించక్కర్లేదు: కోర్టు
వైవాహిక అత్యాచార బాధితులు కూడా అందరిలాంటి వాళ్లేనని, వారిని కూడా ఇతర బాధితులతో సమానంగా చూడాలని ఢిల్లీ కోర్టు తెలిపింది. గర్భిణి అయిన భార్యపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడైన భర్తకు బెయిల్ ఇవ్వడాన్ని నిరాకరిస్తూ ఢిల్లీ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వైవాహిక అత్యాచార కేసులు నానాటికీ పెరిగిపోతుండడంతో, భార్య అయినంత మాత్రాన భర్త ఎలా పడితే అలా వ్యవహరించడానికి వీల్లేదని కోర్టు తెలిపింది.
ఇలాంటి కేసుల్లో బాధితులకు ప్రభుత్వ సాయం కూడా ఏమీ అందడం లేదని కోర్టు గుర్తు చేసింది. బాధితురాలి సంరక్షణ బాధ్యతలు ఢిల్లీ సర్కారు చేపట్టాలని అదనపు సెషన్స్ జడ్జి కామినీ లావూ ఆదేశించారు. గర్భం దాల్చినా తన భర్త తాగొచ్చి పడక సుఖం అందించాలని బలవంతం చేస్తున్నాడని బాధితురాలు కేసు పెట్టింది. దీనిపై జడ్జి స్పందిస్తూ భర్త అయినంత మాత్రాన అతడు పెట్టే ఆంక్షలన్నీ భరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నిందితుడి మానసిక స్థితి బాగోలేని కారణంగా బెయిల్ ను తిరస్కరిస్తున్నట్టు జడ్జి పేర్కొన్నారు.