: ఐపీఎల్ భారత్ లోనే నిర్వహించాలంటున్న షారుక్
కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ యజమాని, బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ ఐపీఎల్-7పై తన మనసులో మాట బయటపెట్టారు. తాజా సీజన్ ను భారత్ లోనే నిర్వహించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికలతోపాటే లీగ్ ను కూడా జరిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ కు భద్రత కల్పించలేమని హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై షారుక్ స్పందిస్తూ, ఫ్రాంచైజీ యజమానుల్లో అత్యధికులు భారత్ లోనే లీగ్ జరగాలని భావిస్తున్నారని తెలిపారు. నైట్ రైడర్స్ సొంతమైదానం కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ కంటే మంచి మైదానం మరెక్కడా ఉండదని చెప్పారు. కాగా, ఈ వేసవిలో ఎన్నికలు జరగనుండగా, ఐపీఎల్ ను దక్షిణాఫ్రికాగానీ, యూఏఈగానీ తరలిస్తారని తెలుస్తోంది.