: క్రికెట్ ను వీడిన గ్రేమ్ స్మిత్
దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం గ్రేమ్ స్మిత్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. సౌతాఫ్రికాకు హాన్సీ క్రానే తరువాత అత్యంత శక్తిమంతమైన కెప్టెన్ గా క్రీడా పండితుల చేత నీరాజనాలందుకున్న స్మిత్ ఆకస్మిక నిర్ణయం పట్ల క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. కేప్ టౌన్ లో ఆసీస్ తో జరిగిన చివరి టెస్టు ముగిసిన వెంటనే తాను క్రికెట్ నుంచి వైదొలగుతున్నట్టు తెలిపాడు.
క్రికెట్ మైదానంలో స్మిత్ యోధుడు అనేందుకు ఏన్నో ఉదాహరణలు ఉన్నాయి. కెప్టెన్ గా ఎన్నో ఇన్నింగ్స్ లను అతను అద్భుతంగా ముగించాడు. కెరీర్ లో స్మిత్ 27 టెస్టు సెంచరీలు చేశాడు. అతను సెంచరీ చేసిన ప్రతి టెస్టులోనూ సౌతాఫ్రికా జట్టుదే విజయం. ఇంగ్లాండ్ జట్టుపై ఓ డబుల్ సెంచరీ కూడా బాది స్మిత్ సత్తా చాటాడు. ఒకసారి ఆస్ట్రేలియా సిరీస్ లో చేయి విరిగిపోయింది. అయినప్పటికీ మొక్కవోని విశ్వాసంతో బ్యాటింగ్ చేసి సత్తా చాటాడు.
117 టెస్టు మ్యాచ్ లు ఆడిన స్మిత్ 109 టెస్టులకు కెప్టెన్ గా వ్యవహరించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. 197 వన్డేలు ఆడిన స్మిత్ 37.98 సగటుతో 6989 పరుగులు చేశాడు. ఇందులో పది సెంచరీలు ఉన్నాయి. ఇంకొంత కాలం క్రికెట్ ఆడగల సత్తా ఉన్న స్మిత్ తన సొంతగడ్డ న్యూలాండ్స్ లోనే రిటైరయితే బాగుంటుందని భావించి సహచరులకు టెస్టు మూడో రోజునే తన నిర్ణయాన్ని వివరించాడు.
తన జీవితంలో ఇంత క్లిష్టమైన నిర్ణయం తీసుకోలేదని, గత ఏప్రిల్ లో తన మడమకు ఆపరేషన్ చేయించుకున్నప్పట్నుంచి రిటైర్ మెంట్ గురించి ఆలోచిస్తున్నట్టు తెలిపాడు. ఇంతమంది అద్భుతమైన వ్యక్తులకు నేతృత్వం వహించడం గర్వంగా భావిస్తున్నానని స్మిత్ తన సహచరులను కొనియాడాడు.