: కాంగ్రెస్ తీరుతో మున్సిపాలిటీలు నిర్వీర్యమైపోయాయి: బాబు


కాంగ్రెస్ పార్టీ తీరుతో రాష్ట్రంలోని మున్సిపాలిటీలన్నీ నిర్వీర్యమైపోయాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. హైదరాబాదులోని ఆయన నివాసంలో మాట్లాడుతూ, రాష్ట్రం మొత్తం అంధకారం అలముకుందని అన్నారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా గంటల తరబడి కరెంటు కోత విధిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అన్ని రంగాలు భ్రష్టుపట్టిపోయాయని ఆరోపించారు.

హాస్టళ్లలో భోజనం, స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు అన్నీ కోర్టులు చెబితేనే కానీ కాంగ్రెస్ పార్టీ నిర్వహించలేకపోతోందని ఆయన విమర్శించారు. ప్రజాశ్రేయస్సుపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధిలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఒక్కరికే కట్టబెట్టి వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. హైదరాబాదులో 37 శాతం మంది ప్రజలు మురికివాడల్లో నివసిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో అంధకారం అలముకుని మురికికూపాల్లా తయారయ్యాయని ఆయన మండిపడ్డారు. శుభ్రతలో అగ్రస్థానంలో ఉండే హైదరాబాదు 87వ స్థానానికి పడిపోయిందని అన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో 258 పథకాలకుగాను 28 పథకాలు పూర్తి చేశారని తెలిపారు. 17 మురికి నీటి పథకాల్లో ఏ ఒక్కటీ పూర్తి కాలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో అవకతవకలు తప్ప ప్రజలకు ఇంకేమీ మిగలలేదని విమర్శించారు.

రాజీవ్ గృహకల్ప కింద లక్షల్లో వసూళ్లకు పాల్పడ్డారని ఆయన అన్నారు. వందల కోట్ల రూపాయలు ప్రజల వద్దనుంచి అడ్డంగా దోచేశారని చెప్పారు. మున్నిపాలిటీల్లో కనీస సౌకర్యాలు కల్పించలేదని మండిపడ్డారు. పన్నులు మాత్రం లెక్కకు మిక్కిలిగా పెంచేశారని ఆయన ఆరోపించారు. పన్నులు 75 శాతం కంటే ఎక్కువ పెంచకూడదని శాసనం చేసినా 300 నుంచి 1100 అత్యధిక శాతానికి పెంచేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

పెట్రోలు, డీజిల్, వ్యాట్ ధరలు పెరిగిపోయాయి. వాటికి దీటుగా అత్యాచారాలు కూడా పెరిగిపోయాయని అన్నారు. కాంగ్రెస్ నేతలు ముఠానాయకుల్ని తయారు చేసి ప్రజలమీదికి వదిలారని దుయ్యబట్టారు. ఆఖరుకి రాష్ట్రపతి పాలనకు వచ్చేశామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎప్పుడు అధికారం ఇచ్చినా సక్రమంగా పాలించలేదని ఆయన ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News