: హస్తినలో చిరంజీవి కొత్త చిరునామా


ఇంటి నెంబరు 17, అక్బర్ రోడ్, న్యూ ఢిల్లీ ... ఇది దేశ రాజధానిలో చిరంజీవి కొత్త చిరునామా. కేంద్రమంత్రిగా ప్రభుత్వం చిరంజీవికి తాజాగా అక్బర్ రోడ్డులోని 17 వ నెంబర్ ఇంటిని కేటాయించింది. ఈ ఇంటిలో గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత అర్జున్ సింగ్ 17 ఏళ్ల పాటు నివాసం వున్నారు. విశాలమైన పచ్చిక బయళ్ల నడుమ అందంగా వుండే ఈ బంగ్లా తాజాగా చిరంజీవి కోసం మరింతగా ముస్తాబవుతోంది.

చిరంజీవి అభీష్టం మేర ఇంటికి ప్రస్తుతం వాస్తు ప్రకారం మార్పులు చేర్పులు చేస్తున్నారు. అర్జున్ సింగ్ మరణించిన తర్వాత కొన్నాళ్ళు ఈ ఇల్లు ఖాళీగానే వుంది. ఇటీవలే ఓ సీనియర్ పార్లమెంటు సభ్యుడికి దీనిని కేటాయించారు. అయితే, సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ పట్టుబట్టి ఆ ఎంపీని ఖాళీ చేయించి, చిరంజీవికి దీనిని కేటాయించేలా చేశారు. వచ్చే నెలలో చిరు గృహప్రవేశం చేస్తారట. ఇప్పటి వరకూ ఆయన వసంత కుంజ్ లోని మిత్రుని ఇంట్లో వుంటున్నారు.     

  • Loading...

More Telugu News