: కత్తులతో స్వైర విహారం.. చైనా రైల్వే స్టేషన్లో రక్తపాతం
నల్లటి దుస్తుల్లో వచ్చారు. చేతుల్లో పొడవాటి పదునైన కత్తులతో రైల్వే స్టేషన్లో రక్తపాతం సృష్టించారు. హఠాత్పరిణామంతో బిత్తరపోయిన ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. పరిగెత్తలేని వారిని క్రూరులు అడ్డంగా నరికేశారు. 33 మందిని విగతజీవులను చేశారు. వాయువ్య చైనాలోని యున్నాన్ ప్రావిన్స్, కున్మింగ్ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి ఈ మారణహోమం సాగింది. 133 మందికి గాయాలయ్యాయి. పోలీసులు అతికష్టం మీద ఒక దుండగుడిని పట్టుకున్నారు. మరో నలుగురిని కాల్చి చంపారు. గాయపడిన వారిని కున్మింగ్ నెం.1 పీపుల్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. దీన్ని తీవ్రవాద చర్యగా ప్రకటించారు. జింజియాంగ్ ప్రావిన్స్ వేర్పాటు వాద ఉద్యమకారులే దీనికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.
కత్తిపోట్లకు గురై చికిత్స పొందుతున్న ప్రత్యక్ష సాక్షి యాంగ్ హైఫీ మాట్లాడుతూ. 'ఒక వ్యక్తి పొడవైన కత్తితో నావైపే వచ్చాడు. భయంతో పరుగులు పెట్టా. వేగంగా పారిపోలేని వారు కత్తిపోట్లకు గురై నేలకొరిగారు' అని భయంకర పరిస్థితిని వివరించారు. చైనా పాలనకు వ్యతిరేకంగా ప్రత్యేక ప్రాంతం కోసం ఉద్యమిస్తున్న యుగర్ ముస్లింలకు జింజియాంగ్ కేంద్రంగా ఉంది. ఇటీవలి కాలంలో చైనాలో జరిగిన అతిపెద్ద దాడిగా దీన్ని భావిస్తున్నారు. కొత్త అధ్యక్షుడు జిన్ పింగ్ ఏడాది పదవీ కాలం పూర్తవుతుండడం, మంత్రివర్గ సమావేశం జరగడానికి మూడు రోజుల ముందు ఈ దాడి జరగడం గమనార్హం. కాగా, నిందితులను తక్షణం పట్టుకోవాలని జిన్ పింగ్ ఆదేశించారు.