: అరెస్టయి, అటవీశాఖ అతిథిగృహంలో ఉన్న సుబ్రతోరాయ్


సహారా గ్రూప్ సంస్థల అధిపతి సుబ్రతోరాయ్ అరెస్ట్ అయిన అనంతరం ఎక్కడున్నారో తెలుసా? అటవీ శాఖ అతిథి గృహంలో. అరెస్టయితే ఉండాల్సింది జైల్లో కదా, అనే కదా మీ సందేహం. అవును అదుపులోకి తీసుకున్న అనంతరం ఆయనను న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఇప్పుడు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో పోలీసులు ఉంచారు. పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సహారా గ్రూపునకు సంబంధించి మదుపుదారులకు చెల్లించాల్సిన 20 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన కేసులో కోర్టు ధిక్కార నేరానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. సుప్రీంకోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో ఆయనపై ఇటీవల నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. తనపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ ను ఉపసంహరించుకోవాలని చేసిన విజ్ఞప్తిని ‘సుప్రీం’ తోసిపుచ్చడంతో శుక్రవారం సుబ్రతోరాయ్ లక్నో పోలీసులకు లొంగిపోయారు. రాయ్ ను స్థానిక కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర అటవీశాఖ అతిథి గృహంలో పోలీసులు కస్టడీలో ఉంచారు.

అరెస్ట్ చేసిన అనంతరం శుక్రవారం నాడు ఆరుగంటల పాటు రాయ్ తన ఇంట్లోనే ఉండిపోయారు. మహాశివరాత్రి సందర్భంగా కోర్టుకు సెలవు కావడంతో పోలీసులు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆనంద్ కుమార్ ముందు హాజరుపరిచారు. ఈ నెల 4న సుప్రీంకోర్టులో హాజరుపరిచేంతవరకు సుబ్రతోరాయ్ ను పోలీస్ కస్టడీలో ఉంచాలని ఆదేశించింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల్లోగా రాయ్ ను ‘సుప్రీం’లో హాజరుపరచాల్సిన బాధ్యత పోలీసులదేనని న్యాయమూర్తి ఆదేశించారు.

కస్టడీలో ఎక్కడ ఉంచాలన్న విషయం కోర్టు స్పష్టం చేయలేదు. దీంతో లక్నో నగర శివార్లలో ఉన్న అటవీశాఖ అతిథిగృహంలో ఉంచాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. కుక్రయిల్ రిజర్వ్ ఫారెస్టులోని గెస్ట్ హౌస్ లో రాయ్ ను ఉంచుతున్నామని ఏఎస్పీ హబీబుల్ హసన్ మీడియాకు తెలిపారు. ఈ అటవీ ప్రాంతంలో జింకల పార్కు, మొసళ్ల సంరక్షణ కేంద్రం, కేఫ్టీరియా కూడా ఉన్నాయి. సుబ్రతోరాయ్ ను పీఎస్ లో కాకుండా అటవీశాఖ అతిథిగృహంలో ఎందుకు ఉంచారని మీడియా ప్రశ్నించగా, ‘‘నా దగ్గర సమాధానం లేదు’’ అని డీఎస్పీ విద్యాసాగర్ మిశ్రా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News