: లాఠీ చార్జ్ లో కంటి చూపు పోగొట్టుకున్న అర్జున అవార్డు గ్రహీత
అతని పేరు రామ్ కరణ్ సింగ్. పాక్షిక అంధుడే అయినా మొక్కవోని పట్టుదలతో అథ్లెటిక్స్ లో జాతీయ స్థాయికి ఎదిగాడు. లాంగ్ డిస్టెన్స్ రన్ లో కరణ్ సింగ్ ప్రతిభావంతుడిగా ఖ్యాతి గడించాడు. 2012లో అతనికి కేంద్రం అర్జున అవార్డు ప్రదానం చేసింది కూడా. అయితే, తనలాంటి వికలాంగుల కోసం చేపట్టిన ఆందోళన అతడికి కంటిచూపును దూరం చేసింది. వివాదాస్పదమైన వికలాంగుల హక్కుల ఆర్డినెన్స్ పై రాష్ట్రపతి సంతకం చేయరాదని, ఈ మేరకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చొరవ తీసుకోవాలని వికలాంగులు గత కొన్ని రోజులుగా ఢిల్లీలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ నివాసం ఎదుట ధర్నాకు దిగిన తన అంధ మిత్రులకు మద్దతుగా కరణ్ సింగ్ కూడా అక్కడికి వెళ్ళాడు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఈ లాఠీ చార్జ్ లో కరణ్ సింగ్ కంటికి తీవ్రగాయమైంది.
అతడిని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించగా, ఎడమ కన్ను పూర్తిగా పోయిందని వైద్యులు తెలిపారు. కరణ్ సింగ్ కు 14 ఏళ్ళ వయసులో యాక్సిడెంట్ కాగా, చూపు కోల్పోయాడు. 2006లో ఆపరేషన్ అనంతరం పాక్షికంగా చూపొచ్చింది. అటుపై క్రీడలపై దృష్టిపెట్టిన ఈ 23 ఏళ్ళ యువకుడు వికలాంగుల విభాగంలో మారథాన్ పరుగులో స్వర్ణం కైవసం చేసుకున్నాడు. అనంతరం 2010 ఆసియా క్రీడల్లో రజతం, 2011లో టర్కీలో జరిగిన వరల్డ్ చాంపియన్ షిప్ లో కాంస్యం సాధించాడు.