: బ్రిటన్ కు వెళ్లే భారతీయ విద్యార్థులు తగ్గుముఖం
విద్య కోసం బ్రిటన్ బాట పట్టే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. 2013లో 21 శాతం తగ్గుదల కనిపించింది. బ్రిటన్ కు చెందిన నేషనల్ స్టాటిస్టిక్స్ విభాగం ఈ వివరాలు వెల్లడించింది. అంతకుముందు సంవత్సరంలో 17,271 మంది భారతీయ విద్యార్థులు బ్రిటన్ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందగా.. 2013లో ఈ సంఖ్య 13,608కి పడిపోయింది. ఇక పాకిస్థాన్ విద్యార్థుల సంఖ్యలో అయితే 55 శాతం తగ్గుదల కనిపిస్తోంది.
కానీ, అదే సమయంలో చైనా విద్యార్థులు 9 శాతం పెరగడం విశేషం. బ్రెజిల్ నుంచి వచ్చే విద్యార్థులు 147 శాతం పెరిగారు. మలేసియా విద్యార్థుల్లోనూ 24 శాతం పెరుగుదల ఉంది. భారత్ నుంచి బ్రిటన్ కు విద్యార్థుల వలస తగ్గినా.. ఉద్యోగార్థుల వలస మాత్రం పెరగడం విశేషం. 2013లో అత్యధికంగా భారతీయులకే 35 శాతం ఉద్యోగ వీసాలను మంజూరు చేశారు.