: శ్రీలంక తోటల్లో శవాల గుట్ట!
శ్రీలంకలో సైన్యానికి, ఎల్టీటీఈ వేర్పాటు వాదులకు మధ్య దశాబ్దాల తరబడి సాగిన సుదీర్ఘ యుద్ధం 'పెద్దపులి' ప్రభాకరన్ మృతితో అంతమైంది. అంతిమపోరాటంలో లంక దళాలు మానవ హక్కుల హననానికి పాల్పడి, పెద్ద ఎత్తున నరమేధానికి తెగించాయని అంతర్జాతీయంగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా ముల్లైతీవు జిల్లాలోని పుతుక్కుడిరిప్పు పట్టణంలో ఓ వ్యక్తికి చెందిన తోటలో తొమ్మిది శవాలు బయటపడ్డాయి. ఆ వ్యక్తి తన కుటుంబంతో కలిసి తోటను శుభ్రం చేస్తుండగా మృతదేహాల అవశేషాలు బయటపడ్డాయి. దీనిపై పోలీసు విభాగం ప్రతినిధి అజిత్ రోహన మాట్లాడుతూ, అస్థిపంజరాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపామని వెల్లడించారు.
మన్నార్ జిల్లాలో ఒక్క చోటే 80 శవాలు బయటపడ్డాయని అధికారులు వెల్లడించిన కొద్ది రోజులకే ముల్లైతీవు జిల్లాలో ఇలా శవాలు వెలికిచూడడంతో ప్రజల్లో భయాందోళనలు హెచ్చాయి. కాగా, ఎల్టీటీఈతో పోరు సందర్బంగా తామెలాంటి యుద్ధనేరాలకు పాల్పడలేదని వాదిస్తున్న లంకకు తాజా పరిణామాలు తలనొప్పులు తెచ్చిపెట్టేవే.
సోమవారం నుంచి జెనీవాలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సమావేశాలు జరగనున్నాయి. యుద్ధ నేరాలపై లంక సర్కారు దర్యాప్తు సక్రమంగా నిర్వహించలేదన్న విషయంపై ఆ సమావేశాల్లో అమెరికా తీర్మానం ప్రవేశపెట్టనుంది. కాగా, యుద్ధనేరాలపై సాక్ష్యాలను నాశనం చేసేందుకే లంక సామూహిక హత్యలకు పాల్పడిందని ఆస్ట్రేలియా ఆరోపిస్తోంది.