: గద్దర్ రివాల్వర్ ఎక్కుపెట్టి బెదిరించారు: ప్రశాంత్


తన కుమార్తె వెన్నెల ప్రేమ వివాహానికి సహకరించానని గద్దర్ తనపై కక్షగట్టారని ప్రశాంత్ అన్నారు. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు విచారణలో భాగంగా గద్దర్ తిరుమలగిరి పీఎస్ కి వచ్చారు. ఈ సందర్భంగా ఏస్సై రవికిరణ్ కేసు వివరాలు వెల్లడిస్తూ... కానాజీగూడకు చెందిన బీజేపీ ప్రధాన కార్యదర్శి జె ప్రశాంత్ అలియాస్ ప్రభును ఫిబ్రవరి 25న టీచర్స్ కాలనీ వద్ధ గద్దర్, అతని గన్ మెన్లు, కుమారుడు సూర్యకిరణ్, కె.రమేష్, ఖాసీం సాహేబ్, ఇంద్ర, సీఎల్.యాదగిరి అడ్డుకుని రివాల్వర్ ఎక్కుపెట్టి బెదిరించారని ఫిర్యాదు చేశారని తెలిపారు.

తన స్నేహితుడైన రవి పెళ్లికి సహాయం చేశానని, ఇప్పుడు వెన్నెలతో రవికి విడాకులు ఇప్పించాలని, అలాగే రవితో స్నేహం కొనసాగిస్తే చంపేస్తామని బెదిరించారని ప్రశాంత్ ఫిర్యాదులో పేర్కొన్నారని ఎస్సై వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా గద్దర్, అతని ఇద్దరు గన్ మెన్ల వాంగ్మూలాలు ఎస్సై రికార్డు చేశారు.

కాగా గద్దర్ తన వాంగ్మూలంలో ఆ రోజు తాను ఇంట్లోనే ఉన్నానని తెలిపారు. రవి, వెన్నెల మధ్య విభేదాలే ఈ ఫిర్యాదుకు కారణమని పోలీసులు అనుమానిస్తుండగా, గద్దర్ తన కుటుంబ తగాదాలను ఇతరుల మీదికి తోసేస్తూ బలవంతపు కేసులు పెట్టి వేధిస్తున్నారని ప్రశాంత్ ఆరోపించారు. రవి తన చిన్ననాటి స్నేహితుడు కావడంతో, తమ సాన్నిహిత్యాన్ని చూడలేక గద్దర్ బెదిరించారని ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని ప్రశాంత్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News