: శ్రీవారి లడ్డూల విషయంలో పూర్తి అధికారం టీటీడీదే: మద్రాస్ హైకోర్టు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో సంపూర్ణ అధికారం తిరుమల తిరుపతి దేవస్థానానిదేనని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. 2009 అక్టోబర్లోనే శ్రీవారి లడ్డూకు జియోగ్రాఫికల్ ఇండికేటర్ గుర్తింపు లభించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుని పైవిధంగా చెప్పింది. చెన్నైలోని అన్నా నగర్ లో ఉన్న ఓ స్వీటు దుకాణంలో నకిలీ లడ్డూలు అమ్ముతున్నట్లు రెండేళ్ల కిందట ఓ రిటైర్డ్ అధికారి ఫిర్యాదు చేయడంతో టీటీడీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు విచారించిన న్యాయస్థానం టీటీడీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. అటు ఇకనుంచి నకిలీ లడ్డూలు తయారు చేయరాదని స్వీటు దుకాణానికి సూచించి, చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు ఇదే విషయంపై టీటీడీ ఏపీటీడీసీ (ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ డెవలప్ మెంట్ సెంటర్) ను కూడా ఆశ్రయించి, ఎవరైనా నకిలీ లడ్డూలు తయారు చేస్తే చర్యలు తీసుకోవాలని కోరింది. దాంతో, ఏపీటీడీసీ నోటీసు జారీచేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.