: ఐపీఎల్-7 వేదికపై ఎటూ తేల్చని బీసీసీఐ
ఈ వేసవిలో నిర్వహించాల్సిన ఐపీఎల్ ఏడవ సీజన్ పై అనిశ్చితి నెలకొంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ కు పూర్తి స్థాయి భద్రత ఏర్పాటు చేయలేమని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో, దక్షిణాఫ్రికా వేదికగా లీగ్ మ్యాచ్ లు జరిపి, నాకౌట్ పోటీలను భారత్ లో జరపాలని ఇంతకుముందు బీసీసీఐ భావించింది. అయితే, నేడు భువనేశ్వర్ లో భేటీ అయిన బీసీసీఐ వర్కింగ్ కమిటీ వేదికపై ఏమీ తేల్చకుండానే సమావేశాన్ని ముగించింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతే ఐపీఎల్ తేదీలు, వేదికను ప్రకటించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికాలో వీలుకాకపోతే, యూఏఈలో జరపాలన్నది బీసీసీఐ యోచన.