: మరో విభజన దిశగా కాంగ్రెస్ నిర్ణయం.. 'ప్రత్యేక బోడోలాండ్' అధ్యయనానికి కమిటీ


కీలకమైన ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ సర్కారు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పని పూర్తి చేసిన కేంద్రం.. ప్రత్యేక బోడోలాండ్ రాష్ట్ర డిమాండ్ పై అధ్యయనానికి కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 9 నెలల్లోగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. అంటే తెలంగాణ ప్రత్యేక డిమాండ్ పై అధ్యయనానికి కేంద్రం వేసిన శ్రీకృష్ణ కమిటీ తరహాలోనే ఈ కమిటీ కూడా పనిచేయనుంది. ఒకవేళ ఈ కమిటీ ప్రత్యేక బోడోలాండ్ కు అనుకూలంగా నివేదిక సమర్పిస్తే... ఎన్నికల అనంతరం ఏర్పడే ప్రభుత్వం అసోం నుంచి కొంత భాగాన్ని వేరుచేసి ప్రత్యేక బోడోలాండ్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత నెలకొంటుంది. తద్వారా దేశంలో మరొక కొత్త రాష్ట్రం పురుడు పోసుకుంటుంది.

బోడోలాండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఎప్పటి నుంచో ఉంది. ప్రత్యేక బోడోలాండ్ కోసం సాయుధ పోరాటం చేస్తున్న బోడోలాండ్ లిబరేషన్ టైగర్ ఫోర్స్(బీఎల్టీఎఫ్) తో కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించడంతో 2003లో తీవ్రవాదులు ఆయుధాలు అప్పగించి తమ పోరాటానికి ముగింపు పలికారు. దాంతో కేంద్ర ప్రభుత్వం బోడోలాండ్ ప్రాదేశిక మండలిని ఏర్పాటు చేసింది. ఒక విధంగా పాలనలో ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిలాంటిది. 2012లో మండలి పరిధిలో పెద్ద ఎత్తున జాతి ఘర్షణలు జరిగాయి. 1300 కుటుంబాలు తీవ్ర ప్రభావానికి లోనయ్యాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను గుర్తించి ఏర్పాటుకు ఆమోదం తెలపడంతో.. బోడోలాండ్ కోసం అసోంలో మరోసారి ఆందోళనలు పెద్ద ఎత్తున మొదలయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరం.

స్వాతంత్ర్యానంతరం అసోం మూడు సార్లు ముక్కలైంది. మొదటిసారి 1963లో అసోం నుంచి కొంత భాగాన్ని వేరు చేసి నాగాలాండ్ ను ఏర్పాటు చేశారు. 1971లో మేఘాలయ అవతరించింది. 1971లో మిజోరాం కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడి.. 1985లో ప్రత్యేక రాష్ట్రం అయింది. భవిష్యత్తులో బోడోలాండ్ రాష్ట్రంతో అసోంను నాలుగోసారి విచ్చిన్నం చేసినట్లే!

  • Loading...

More Telugu News