: నగ్మా, జయప్రద, రవి కిషన్ లకు కాంగ్రెస్ టికెట్లు?
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సినీ నటులే ఎక్కువగా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నటి నగ్మా, జయప్రద, భోజ్ పురి నటుడు రవి కిషన్ లకు ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ సీట్లు కేటాయించిందట. ఒకప్పుడు దివంగత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పోటీ చేసిన యూపీలోని చారిత్రాత్మక నియోజకవర్గం పుల్ పుర్ ను నగ్మాకు కేటాయించాలని పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం భోజ్ పురి సినీ పరిశ్రమలో ఆదరణ ఉన్న నగ్మా గ్రామీణ ప్రాంతాల్లో తన ఫేమ్ తో ఓట్లు రాబడుతుందని నమ్ముతున్నారు. ఏఐసీసీ సభ్యురాలైన ఆమె గతంలో 2004 లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ తరపున ప్రచారం చేసిన అనుభవంతో ఇప్పుడు ప్రజలను ఆకట్టుకుంటుందని నమ్ముతున్నారు.
ఇక భోజ్ పురి పరిశ్రమలో విభిన్న నటనతో స్టార్ డమ్ హోదా ఉన్న నటుడు రవి కిషన్ కు తూర్పు యూపీ నుంచి సీటు కేటాయిస్తున్నారట. ఇక సమాజ్ వాదీ పార్టీ నుంచి బయటికొచ్చి, రాంపూర్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న జయప్రద త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో యూపీలోని మైనారిటీలు ఎక్కువగా ఉన్న మోరాదాబాద్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారట.