: అమరావతి, కోటప్పకొండలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు
గుంటూరు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన అమరావతిలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం మొదలైన ఈ ఉత్సవాలు మహాశివరాత్రి రోజున జరిగే ప్రత్యేక అభిషేకాలు, అనంతరం జరిగే అమర లింగేశ్వరుని కల్యాణోత్సవం, రథోత్సవంతో ముగుస్తాయి. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు శివరాత్రికి అమర లింగేశ్వరుణ్ణి దర్శించుకుంటారు.
జిల్లాలోని మరో పుణ్యక్షేత్రమైన కోటప్పకొండలో జరిగే తిరునాళ్లకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే ఈ తిరునాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఈ తిరునాళ్లను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించిన విషయం విదితమే. కోటప్పకొండ జాతరకు వచ్చే భక్తుల కోసం దేవాదాయ శాఖాధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.