: యజమాని హంతకుడిని పట్టించిన చిలకమ్మ
మాటలు నేర్చిన ఓ చిలుక తన యజమానిని హత్య చేసిన వ్యక్తిని పట్టించిన సంఘటన ఆగ్రాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఆగ్రాలో విజయ్ శర్మ అనే వ్యక్తి భార్య నీలం ఈ నెల మొదటి వారంలో హత్యకు గురైంది. నీలంను హత్య చేసింది ఎవరో తెలీక ఆమె కుటుంబ సభ్యులు, పోలీసులు తలలు పట్టుకున్నారు. జంతు ప్రేమికురాలైన నీలం ఓ చిలుకను పెంచుకుంది. దానికి మాటలు కూడా వచ్చు. పాపం, తన యజమాని చనిపోయినప్పటి నుంచి అది ఆహారం తీసుకోవడం మానేసింది.
అయితే, విజయ్ శర్మ సమీప బంధువు ఆశూ వారి ఇంటికి వచ్చినప్పుడు చిలుక వెంటనే పంజరంలోకి వెళ్ళిపోయేదట. మిగతా సమయంలో అది ఇల్లంతా కలియదిరుగుతూ ఉండేది. ఒకరోజు పోలీసుల ఎదుట విజయ్ శర్మ తనకు అనుమానం ఉన్న వ్యక్తుల పేర్లు చెబుతూ, బంధువు ఆశూ పేరు పలకగానే చిలుక 'ఉస్ నే మారా, ఉస్ నే మారా (అతడే చంపాడు, అతడే చంపాడు)' అంటూ అరిచింది. దీంతో, ఆశూను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆశూ... నీలంను చంపే సమయంలో కుక్క వారిపైకి దూకగా, దాన్ని కూడా చంపేశారట అతని అనుచరులు.