: బాలీవుడ్ లో మార్మోగుతున్న మోడీ నామస్మరణ
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి బాలీవుడ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది. అమితాబ్ బచ్చన్ నుంచి అజయ్ దేవ్ గణ్ వరకు అందరిదీ మోడీ నామస్మరణే. తాజాగా ఈ జాబితాలో వివేక్ ఓబెరాయ్ వచ్చి చేరాడు. ముంబయిలో జరిగిన 'రన్ ఫర్ యువర్ కంట్రీ' మారథాన్ ఆరంభోత్సవంలో పాల్గొన్న వివేక్... మోడీపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. మోడీ ప్రధాని అయితే దేశం పురోగామి పథంలో పయనిస్తుందన్న ఆశ కలుగుతోందని చెప్పారు. తదుపరి ప్రధాని మోడీయే కావాలని ఆకాంక్షిస్తున్నట్టు మీడియా అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చాడు.
ఇప్పటికే సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ లు మోడీకే తమ మద్దతని బహిరంగంగా ప్రకటించారు. నర్మదా డామ్ విషయంలో మోడీతో విభేదించిన అమీర్, ఓవరాల్ గా గుజరాత్ అభివృద్ధిని మాత్రం ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. ఇక అమితాబ్ గుజరాత్ రాష్ట్ర అధికార బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన కోడలు ఐశ్వర్య రాయ్ కూడా మోడీపై అభిమానాన్ని పలు వేదికలపై ప్రదర్శించడం తెలిసిందే. మరోవైపు, గుజరాత్ సౌర శక్తి ప్రాజెక్టులో భాగస్వామి అయిన అజయ్ దేవ్ గణ్... మోడీని ఆకాశానికెత్తేస్తున్నాడు. తనకు ఆయనలోని రాజకీయవాది కంటే వ్యాపారవేత్త లక్షణాలు బాగా నచ్చుతాయని చెప్పాడు.