: అత్తామామల దాష్టీకానికి గర్భవతి బలి
ఆడ, మగ అన్న తేడా లేకుండా అభివృద్ధి చెందుతున్న సమాజంలో ఇంకా కొన్ని చోట్ల ఆ భేదం వేళ్లూనుకున్నట్లు కనిపిస్తోంది. అబ్బాయే కావాలన్న పట్టుదల చాలామంది మెదళ్లలో కూరుకుపోవడంతో దారుణమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆ మూఢ ఆలోచనతో బిడ్డ భూమ్మీదకు రాకుండా కడపులో ఉండగానే కొట్టి చంపేస్తున్నారు. అలాంటి ఘటనే రాజస్థాన్ లోని భోపాల్ ఘర్ కు దగ్గర్లో ఉన్న ఓ కుగ్రామంలో చోటు చేసుకుంది. శివారీ దేవీ(20) అనే మహిళ తన భర్త శ్రీరామ్, అత్తమామలతో ఉంటోంది. కొన్నాళ్లకి ఆమె గర్భవతి కావడంతో పుట్టబోయేది ఆడో, మగో తెలుసుకోవాలనుకున్న అత్తామామలు లింగ నిర్ధారణ పరీక్ష చేయించారు.
పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసింది. అప్పటినుంచీ అత్తమామలు ఆమెను శారీరకంగా హింసించడం ప్రారంభించారు. అప్పటికే విషయాన్ని తన అన్న రాందీన్ కు శివారీ ఫోన్ లో చెప్పింది. ఆ హింస తట్టుకోలేని శివారీ కొద్ది రోజుల కిందట మరణించింది. కోడలు చనిపోయిన విషయాన్ని అత్తామామలే ఆమె అన్నకు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే అతడు దగ్గర్లోని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. తన చెల్లి ఒంటిపై కొట్టిన దెబ్బల గాయాలు కూడా ఉన్నాయని, అవే సాక్ష్యాలని తెలిపాడన్నారు. అతని ఆరోపణల ఆధారంగా ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.