: రాష్ట్రంలో పొత్తులు.. కత్తులు ఈ పార్టీల మధ్యే
ఎన్నికలకు మరో నెల రోజుల గడువే ఉంది. అధికారం కోసం, ప్రజామోదం కోసం రాజకీయ పార్టీలు మంత్ర, తంత్ర, టక్కు టమారా విద్యలతో ప్రజలను బురిడీ కొట్టించడానికి రెడీ అవుతున్నాయి. 60 ఏళ్ల ఐక్య తెలుగు రాష్ట్రం రెండు ముక్కలవుతున్న నేపథ్యంలో ప్రజలు పార్టీల జాతకాలను కొత్తగా లిఖించనున్నారు, తారుమారు చేయనున్నారు. ఎవరెన్ని వేషాలు వేసినా కర్రుకాల్చి వాతపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు.
తెలంగాణలో ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్, తెలుగుదేశం. వీటిలో టీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం కావడం లేదా పొత్తు పెట్టుకుని ముందుకు పోవడం దాదాపుగా ఖాయం. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరడంతో వీటికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఇక ప్రతిపక్షమైన టీడీపీ ఒంటరిగానే పోరాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీతో పొత్తుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నా.. అందుకు తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఈ రెండు పార్టీలు కలిసి తెలంగాణలో ఎన్నికలకు వెళ్లే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇక వామపక్షాలు, వైఎస్సార్ కాంగ్రెస్ లలో... వామపక్షాలు తెలంగాణలో ఎవరితో కలిసి సాగేదీ ఇప్పటికైతే స్పష్టం చేయలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ కు పెద్దగా కేడర్ లేదు గనుక దాని ప్రభావం నామమాత్రమే. మాజీ సీఎం కిరణ్ పార్టీ పెట్టినా దానికి తెలంగాణలో డిపాజిట్లు వచ్చే అవకాశం ఉండదు.
సీమాంధ్రలో బీజేపీ, టీడీపీ పొత్తు దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీపీఎం, సీపీఐలతో కలసి సాగడానికి చర్చలు కూడా జరిగాయి. ప్రధాన పోటీ ఈ రెండు కూటముల మధ్యే సాగనుంది. కాంగ్రెస్ పార్టీకి వాతపెట్టడానికి సీమాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కిరణ్ పార్టీ పెడితే.. రాష్ట్ర విభజనకు చివరి వరకూ అడ్డంపడిన నేతగా సాఫ్ట్ కార్నర్ తో మంచిగా ఓట్లు పడే అవకాశం ఉంది. ఈయన పార్టీ టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ గెలుపోటములను తారుమారు చేయగలదు.