: మార్స్ పైకి వెళితే చస్తారు: ముస్లిం కమిటీ ఫత్వా
మార్స్ పైకి వన్ వే యాత్రను ఇస్లాం ఆమోదించదంటూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ఇస్లామిక్ వ్యవహారాల కమిటీ ఫత్వా జారీ చేసింది. నెదర్లాండ్స్ కు చెందిన మార్స్ వన్.. అంగారకుడిపైకి మానవయాత్రను తలపెట్టిన విషయం తెలిసిందే. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఉత్సాహవంతుల నుంచి దరఖాస్తులు కోరగా.. రెండు లక్షల మంది ఆసక్తి చూపారు. వీరిలో కొందరిని ఎంపిక చేసిన తర్వాత 2024లో వారిని తీసుకెళ్లి మార్స్ పై వదిలేసి వస్తుంది. ఇక వారు అక్కడే నివసించవచ్చని ఆ సంస్థ చెబుతోంది. అలా తీసుకెళ్లి వదిలేస్తే ప్రాణాలకు ప్రమాదకరమని, అక్కడ జీవించడానికి అనువైన వాతావరణ పరిస్థితులు లేవని ఇస్లాం ఫత్వా కమిటీ అభిప్రాయపడింది. మార్స్ వన్ యాత్ర ద్వారా అంగారకుడిపైకి వెళితే మరణించడం ఖాయమని పేర్కొంది.