: రగులుతున్న థాయ్ లాండ్.. రహస్య ప్రదేశానికి ప్రధాని
థాయ్ లాండ్ రాజకీయ సంక్షోభం హింసారూపం దాల్చింది. అపద్ధర్మ ప్రధాని ఇంగ్లక్ షినవత్రా అధికారాన్ని త్యజించి తక్షణం గద్దెదిగాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండుతో రాజధాని బ్యాంకాక్ లో వారు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. ఆందోళనకారుల డిమాండ్ మేరకు ఆమె గతేడాది డిసెంబర్ లో ప్రభుత్వాన్ని రద్దు చేశారు. అప్పటి నుంచి అపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతున్నారు. అయినా ఆమె ప్రధాని పీఠాన్ని విడిచిపెట్టాల్సిందేనని ఆందోళనకారుల డిమాండ్. దీంతో హింసకు భయపడిన ఇంగ్లక్ బ్యాంకాక్ విడిచి 150 కిలోమీటర్ల దూరంలో సురక్షిత ప్రదేశానికి వెళ్లి పాలన కొనసాగిస్తున్నారు. మరోవైపు పరిస్థితి ఇలానే కొనసాగితే దేశంలో పరిస్థితి అదుపు తప్పుతుందని ఆ దేశ ఆర్మీ చీఫ్ ప్రయూత్ హెచ్చరించారు.
గతేడాది నవంబర్ వరకు ఇంగ్లక్ పాలన ప్రశాంతంగా సాగిపోయింది. వివాదాస్పద ఆమ్నెస్టీ బిల్లును తీసుకురావాలని ఇంగ్లక్ గతేడాది నవంబర్ లో ప్రయత్నించారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే మాజీ ప్రధాని, తన అన్నయ్య తక్సిన్ షినవత్రాపై ఉన్న అవినీతి దోషత్వం తొలగిపోయి.. తిరిగి స్వదేశంలోకి అడుగుపెట్టడానికి ఆయనకు వీలు కల్పిస్తుంది. ఆయన ప్రస్తుతం దేశం వెలుపల ఆశ్రయం పొందుతున్నారు. బయట ఉన్నప్పటికీ తన సోదరి ఇంగ్లక్ ద్వారా వ్యవహారాలు నడుపుతున్నారని ఆందోళనకారులు మండిపడుతున్నారు. ఆమ్నెస్టీ బిల్లుతో ఇంగ్లక్ దోషులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ మొదలైన ఆందోళనలు ఇప్పుడు ఆ దేశాన్ని దహించేలా మారుతున్నాయి.