: కర్నూలు రాజధానిగా చేయాలంటూ దీక్షకు దిగిన బైరెడ్డి
సీమాంధ్రకు రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలంటూ రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్.పి.ఎస్) అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి రెండు రోజుల నిరాహార దీక్ష చేపట్టారు. కర్నూలులోని జిల్లా పరిషత్ గాంధీ విగ్రహం వద్ద ఆయన ఈరోజు ఉదయం దీక్ష చేపట్టారు. అంతకు ముందు ఆయన కర్నూలులోని శ్రీకృష్ణదేవరాయలు విగ్రహానికి పూలమాల వేసి, పార్టీ ముఖ్య నేతలు, విద్యార్థులతో కలసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బైరెడ్డి మీడియాతో మాట్లాడారు.
గతంలో రాజధానిని కర్నూలు నుంచి హైదరాబాదుకు మార్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్ర విభజన అనంతరం కర్నూలునే రాజధానిగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తద్వారా కర్నూలులో విద్యా, ఉద్యోగ, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. సీమలో ఉన్న స్వార్థ రాజకీయ నాయకుల వల్లే రాయలసీమకు అన్యాయం జరుగుతోందని ఆయన చెప్పారు. శ్రీబాగ్ ఒడంబడికలో రాయలసీమకు రాజధాని హక్కుగా ఉందని, వెనుకబడిన రాయలసీమకు నికర జలాలు అందించి ఆదుకోవాలని ఆయన కోరారు. రాయలసీమకు రాజధాని సాధించే వరకు వెనకడుగు వేసేది లేదని బైరెడ్డి స్పష్టం చేశారు.