: హంగ్ పార్లమెంట్ ఏర్పడే అవకాశమే లేదు: అద్వానీ
వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత హంగ్ పార్లమెంట్ ఏర్పడే అవకాశమే లేదని భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ స్పష్టం చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని, గతంలో సాధించిన స్థానాల కంటే ఎక్కువగానే తాము గెలుచుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏళ్లుగా దుష్ట పాలన చేసిందని, కాంగ్రెస్ పాలన అంతా అవినీతిమయమని అద్వానీ వ్యాఖ్యానించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఎక్కువ కాలం అధికారంలో ఉన్నది ఇప్పుడేనని ఆయన చెప్పారు. అయితే, ఈసారి కాంగ్రెస్ అత్యంత తక్కువ సీట్లతో సర్దుకోవాల్సి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదని తెలిపారు.
దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల వాతావరణం నెలకొని ఉందని ఆయన అన్నారు. గతంలో గెలుపొందిన స్థానాల కంటే బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని తెలిపారు. దీనికి కాంగ్రెస్ పార్టీ దుష్ట పాలన, యూపీఏ హయాంలో వెలుగులోకి వచ్చిన అవినీతి కుంభకోణాలే కారణమని ఆయన పేర్కొన్నారు.