: అసోంలో ‘విజయ్ సంకల్ప్ అభియాన్ ర్యాలీ’లో పాల్గొన్న నరేంద్ర మోడీ
అరుణాచల్ ప్రదేశ్ నుంచి బయల్దేరిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అసోంకు చేరుకున్నారు. అనంతరం అసోంలో జరిగిన ‘విజయ్ సంకల్ప్ అభియాన్ ర్యాలీ’కి ఆయన హాజరయ్యారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడారు. అసోం ముఖ్యమంత్రికి ప్రజల కష్టాలు తెలుసుకునే తీరికే లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి దేశానికి విముక్తి కావాలని ఆయన అన్నారు. బరాక్, బ్రహ్మపుత్ర లోయలను కాంగ్రెస్ విభజిస్తోందని ఆయన ఆరోపించారు. ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే ‘కమలం’ వికసించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. అసోం టీ తోటల్లో పనిచేసే కార్మికులు తమ పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించాలని ఆయన అన్నారు. విద్యాభివృద్ధితోనే అక్కడ ఆర్థికాభివృద్ధి సాధ్యమని మోడీ తేల్చి చెప్పారు.