: చెన్నైకి ఎలా ఆడానో... ముంబయికీ అలానే సేవలందిస్తా: హసీ
ఐపీఎల్లో గత సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించిన ఆస్ట్రేలియా దిగ్గజం మైకేల్ హసీ ఈసారి ముంబయి ఇండియన్స్ కు ఎంపికయ్యాడు. చెన్నై జట్టుతో అనుబంధం కొనసాగించాలని భావించినా, నూతన వేలం విధానం హసీకి అడ్డుగా నిలిచింది. ఈసారి అతడిని ముంబయి ఫ్రాంచైజీ చేజిక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఓ మీడియాకు సంస్థకు హసీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. గత ఆరేళ్ళుగా చెన్నై జట్టుతో కొనసాగానని, కొత్త రొటేషన్ విధానం ద్వారా ఎవరినీ ఎక్కువకాలం అట్టిపెట్టుకోవడం కుదరదని తెలిపాడు. ఇప్పటివరకు చెన్నైకి ఎలాంటి సేవలందించానో, ఇకపై ముంబయికీ అలాగే సేవలందిస్తానని చెప్పాడు. అయితే, చెన్నై ఫ్యాన్స్ ను మిస్సవడం బాధ కలిగిస్తోందన్నాడు. ఇక ముంబయి జట్టులో రాయుడు, అభిజిత్ తారే, కీరన్ పొలార్డ్ వంటి చక్కని ఆటగాళ్ళున్నారని, మెరుపు బౌలర్ మిచెల్ జాన్సన్ కూడా ఇదే జట్టుకు ఆడనుండడం శుభపరిణామమని అభిప్రాయపడ్డాడు. యువ ఆటగాళ్ళతో కలిసి ఆడనుండడం మంచి అనుభవమని ఈ వెటరన్ క్రికెటర్ చెప్పుకొచ్చాడు.