: బాబు పాదయాత్ర ముగింపులో స్వల్ప మార్పు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గత నాలుగు నెలలుగా సాగిస్తోన్న 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్ర ముగింపులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. తొలుత భావించినట్టుగా ఏప్రిల్ 20 న పాదయాత్రకు ముగింపు పలకడం సాధ్యంకాదని పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు.
అలా ముగించాలంటే బాబు రోజుకు 15-16 కిలోమీటర్లు నడవాల్సి వస్తుందని, ఆయన ఆరోగ్యరీత్యా అదేమంత క్షేమకరం కాదని యనమల అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో పాదయాత్రను ఏప్రిల్ 27న ముగించేందుకు నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు.
ఆరోజున విశాఖలో పాదయాత్ర పైలాన్ ను బాబు ఆవిష్కరిస్తారని యనమల చెప్పారు. అనంతరం భారీ బహిరంగ సభ ఉంటుందని, దానికి రాష్ట్ర నాయకులందరూ హాజరవుతారని తెలిపారు. బాబు ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.