: క్రీడాసంఘాల్లో నేతలకు ఏం పని?: రాహుల్ గాంధీ
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భారత క్రీడావ్యవస్థపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు. క్రీడా సంఘాల్లో రాజకీయ నేతలకు ఏం పని? అని ప్రశ్నించారు. ఢిల్లీలో 'నేషనల్ యూత్ పాలసీ-2014', 'రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్' పథకాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులను క్రీడా సంఘాలు తమ పాలకవర్గాల నుంచి దూరంగా ఉంచాలని సూచించారు. మాజీ క్రీడాకారులకు మరిన్ని అధికారాలివ్వడం ద్వారా ఆయా సంఘాల్లో రాజకీయ ప్రాబల్యాన్ని తగ్గింవచ్చని చెప్పారు. ఇదే పద్ధతిని రాజకీయాలకు అనువర్తింపజేయవచ్చని రాహుల్ పేర్కొన్నారు. యువతకు మరిన్ని అవకాశాలిస్తే దేశ రాజకీయ ముఖచిత్రమే మారిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, ఈ కార్యక్రమానికి కేంద్ర క్రీడల మంత్రి జితేంద్ర సింగ్, బాక్సర్లు మేరీకోమ్, విజేందర్ సింగ్, నేషనల్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, అలనాటి స్ప్రింటర్ అశ్విని నాచప్ప, షూటర్ రంజన్ సోధి, లిఫ్టర్ కరణం మల్లీశ్వరి తదితరులు హాజరయ్యారు.