: ఆసియా కప్ కబుర్లు
ఉపఖండంలోని క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో నాలుగు రోజుల్లో ఆసియా కప్ ఆరంభం కానుంది. బంగ్లాదేశ్ ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. ఈ నెల 25 నుంచి జరిగే ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పాల్గొంటున్నాయి. కాగా, ఈ టోర్నీకి టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీ గాయంతో దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు లంక డాషింగ్ ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్ కూడా టోర్నీలో ఆడేది అనుమానంగా మారింది.
ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న లంక జట్టులో దిల్షాన్ కూడా సభ్యుడు. బంగ్లా జట్టుతో రెండో వన్డే సందర్భంగా వేలికి గాయమైంది. గాయం తీవ్రత దృష్ట్యా ఈ ఆల్ రౌండర్ నేడు స్వదేశానికి పయనమవుతున్నట్టు శ్రీలంక క్రికెట్ బోర్డు నేడు ప్రకటించింది. మార్చి 16 నుంచి టి20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో దిల్షాన్ విషయంలో రిస్క్ తీసుకోవడం ఎందుకుని లంక బోర్డు భావిస్తోంది. అందుకే, ఆసియా కప్ కు అతడికి విశ్రాంతినివ్వనున్నారు.
ఇక, పాకిస్తాన్ జట్టునూ గాయాల బెడద వేధిస్తోంది. లాహోర్లో ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతూ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది గాయపడ్డాడు. జునైద్ ఖాన్ బౌలింగ్ లో ప్యాడల్ స్వీప్ చేసే ప్రయత్నంలో బంతి దవడకు బలంగా తాకింది. గాయం తీవ్రమైనది కాదని, రెండుమూడు రోజుల్లో అఫ్రిది కోలుకుంటాడని కోచ్ మొయిన్ ఖాన్ తెలిపాడు.