: సోనియా తీరు హిట్లర్ ను తలపిస్తోంది: జగన్
తాము ఎంత నిరసన తెలిపినా పట్టించుకోకుండా రాష్ట్రాన్ని విడగొట్టారని వైఎస్సార్సీపీ నేత జగన్ విమర్శించారు. కేవలం 10 సెకన్లలో రాష్ట్రాన్ని ముక్కలు చేశారన్నారు. కేవలం ఐదు నిమిషాల్లో ప్రధాని తన ప్రసంగాన్ని ముగించేశారని చెప్పారు. ప్రధాని ప్రసంగం చూస్తే, వీళ్లు అసలు మనుషులేనా? అనిపిస్తోందని అన్నారు. లోక్ సభలో ప్రత్యక్ష ప్రసారాలను కూడా నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభలో కూడా దారుణంగా వ్యవహరించారని అన్నారు. సీమాంధ్రకు చెందిన ఎంపీలను సభనుంచి సస్పెండ్ చేసి పని కానిచ్చేశారని అన్నారు.
కొత్త రాజధాని కోసం ఎంతిస్తారు, ఎప్పుడిస్తారనే విషయాలను వెల్లడించలేదని జగన్ చెప్పారు. జీతాలు, భత్యాల కోసం సీమాంధ్రులు ఎక్కడకు వెళ్లాలని ప్రశ్నించారు. సీమాంధ్రలో ఏటా రూ. 15 వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటు ఏర్పడుతుందని తెలిపారు. పోలవరానికి ఎంతిస్తారనే విషయంపై కూడా ఎలాంటి క్లారిటీ లేదని తెలిపారు. విభజన విషయంలో సోనియాగాంధీ తీరు హిట్లర్ ను తలపిస్తోందని చెప్పారు.