: ముగిసిన తొలి రోజు ఆట.. ఆసీస్ 231/8
ఢిల్లీ టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ఓ దశలో భారత బౌలర్ల ధాటికి 136 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఆసీస్ ఆట చివరికి మరో వికెట్ నష్టపోయి 231 పరుగులు చేసింది. మిడిలార్డర్ లో స్మిత్ (46) లోయరార్డర్ లో సిడిల్ (47 బ్యాటింగ్) పోరాడడంతో కంగారూలకు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. భారత బౌలర్లలో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ 4, జడేజా 2, ఇషాంత్ 2 వికెట్లు తీశారు.
క్లార్క్ స్థానంలో జట్టు కెప్టెన్సీ చేపట్టిన వాట్సన్ 17 పరుగులు చేసి జడేజా బౌలింగ్ లో స్టంపౌటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో సిడిల్ కు తోడు ప్యాటిన్సన్ (11 బ్యాటింగ్) ఉన్నాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 4 పరుగుల స్కోరు వద్ద ఓపెనర్ వార్నర్ వికెట్ కోల్పోయింది. అక్కడి నుంచి కంగారూలకు కష్టాలు మొదలయ్యాయి. టాపార్డర్ లో ఎవరూ కుదురుకోలేకపోయారు. ఓపెనర్ కోవన్ 38, హ్యూస్ 45 పరుగులు చేశారు.