: శాంతిభద్రతలను గవర్నర్ చేతిలో పెట్టాలంటే సవరణ అవసరం: అరుణ్ జైట్లీ
2006 నుంచి బీజేపీ తెలంగాణ ఏర్పాటుకు మద్దతిస్తోందని బీజేపీ నేత అరుణ్ జైట్లీ తెలిపారు. విభజన విషయంలో యూపీఏ ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరమని చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా చివరి క్షణాల్లో విభజనకు కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం ఆక్షేపణీయమని తెలిపారు. తాము రాష్ట్రాలను విభజించినప్పడు ఇరు ప్రాంతాల్లో పండుగ చేసుకున్నారని తెలిపారు. ఇప్పటి వరకు మనమందరం సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేయలేకపోయామని అభిప్రాయపడ్డారు. పదేళ్ల పాటు హైదరాబాదుని ఉమ్మడి రాజధానిగా చేయడంపై కాని, గవర్నర్ కు హైదరాబాదు శాంతిభద్రతలపై అధికారం ఇవ్వడంపై కాని తమకు భేదాభిప్రాయాలు లేవని చెప్పారు. అయితే రాష్ట్ర శాంతిభద్రతలు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయని... గవర్నర్ కి అధికారం కట్టబెడితే కేంద్రప్రభుత్వం చేతిలోకి వెళతాయని అభిప్రాయపడ్డారు. అందువల్ల దీనికి చట్టరీత్యా సవరణలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించి ప్రధానిని సభలోకి పిలిచి ఆయన చేత సమాధానం చెప్పించడం కాని, సవరణలు చేయడం కాని చేయాలని సూచించారు.